కళకి పరాకాష్ట దాన్ని స్వచ్ఛంగా, అచ్చంగా అనుభూతించగలగటం. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తొలిగా వెలువడిన “మిథునం” చిత్రం ఆ విధంగా చూస్తే కళాత్మకం!
బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి జంటగా నటించిన యీ చలనచిత్రం శ్రీరమణ వ్రాసిన కథ ఆధారంగా రూపొందించబడింది. 2000 సంవత్సరం నాటికే ఆ కథ మళయాళ దర్శకుడైన ఎమ్.టి. వాసుదేవన్ నాయర్‌కి పరిచయమై చలనచిత్రంగా (మళయాళంలో) రూపుదిద్దుకుంది. తెలుగునాట అంతటి కథారాజాన్ని యింకా చలనచిత్రంగా రూపొందించలేకపోతున్నామని బహిరంగంగానే పలుమార్లు బాధపడిన తనికెళ్ళ భరణి చివఱికి తానే పూనుకుని కథావిస్తరణ భారాన్ని దాల్చి, దర్శకునిగా యెదిగి, నిర్మాతని వెదికి తెఱరూపాన్ని చిత్రించి వ్యయప్రయాసలను, కష్టనష్టాలను దాటి “మిథునం” చిత్రాన్ని ప్రేక్షకుల ముంగిటికి తీసుకువచ్చారు. ఆ ప్రయత్నంలో వారికి అండదండలందించి, చేయుతనిచ్చిన నిర్మాత ఆనంద ముయిద రావు గారు, విడుదలకి సహకరించిన సహృదయులందఱూ అభినందనీయులు.
కథగా ఒక దశాబ్దానికి పైగా పరిచయమున్న కథని, అందునా పెద్దల మెప్పును పొందటమే కాక “రచ్చ గెలిచి” జాతీయ పురస్కారంతో సహా యెన్నో దేశవిదేశ ప్రదర్శనల్లో అభినందనలు పొందిన మళయాళ చిత్రంగా కూడా తెలిసిన కథకి తెలుగు తెఱసేత కష్టమైన పనే. ఆ పని చేయబూనిన వ్యక్తికి అదే దర్శకుడిగా తొలి (పూర్తినిడివి) చలనచిత్రమైతే దాన్ని సాహసమనే చెప్పాలి! ఆ సాహసాన్ని తలపెట్టిన తనికెళ్ళ భరణి ప్రయత్నం సఫలమేనా అన్నది తెలుసుకోవాలంటే “మిథునం” చూసి తీరవలసిందే!
శ్రీకృష్ణ, కేశవ, నారాయణ, మాధవ, గోవిందుల తల్లిదండ్రులైన బుచ్చిలక్ష్మి (లక్ష్మి), అప్పదాసు (బాలసుబ్రహ్మణ్యం) తమ అయిదుగురు కొడుకులు యెదిగి తమ తమ అభిరుచులకు అనుగుణంగా విదేశవాసులయ్యాక తమ యిష్టప్రకారం తమ సొంత ఊరిలోని పెంకుటింట్లో హాయిగా సంతోషంగా తమదైన జీవితాన్ని యెలా గడుపుతున్నారన్నదే యీ చిత్రకథ. ఎదిగిన పిల్లలు ఱెక్కలొచ్చి యెగిఱి వెళ్ళిపోయాక వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి వదిలి తమ జీవితాన్ని తామే హాయిగా గడపాలని స్థిరంగా నమ్మే గృహస్థుడు అప్పదాసు. భర్త ఉద్దేశాల వెనక ఉన్న ప్రేమాభిమానాలను, సత్యాన్ని చూసిన యిల్లాలు బుచ్చిలక్ష్మి. యాభయ్యేళ్ళ కాపురంలో దంపతులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని సహజీవనం సాగించిన ఆ మిథునానికి సావకాశంగా పరస్పర సాహచర్యాన్ని సంపూర్తిగా అనుభవించే సదవకాశం ఆ వానప్రస్థ జీవనం కల్పిస్తుంది. వాళ్ళ సరదాలు, సంతోషాలు, కోపావేశాలు, ప్రేమానురాగాలు, చిలిపితనాలు, మొండితనాలు, అల్లరులు, అలకలు, …అన్నిటి సమాహారం యీ చిత్రం.
శ్రీరమణ వ్రాసిన కథలో ముసలి దంపతుల అభిప్రాయాలు, అనుభూతులు చెప్పుకోవడానికి, వినడానికీ మఱో పాత్ర ఉంది. మళయాళచిత్రం “ఒరు చిరు పుంజిరి“లో కథాగమనానికి సహాయకారులుగా దాదాపు యిరవై పాత్రల దాకా ఉన్నాయి! అచ్చులో ముప్ఫై పుటలు కూడా లేని కథని రెండు గంటల నిడివికి విస్తరిస్తూనే కథలో ఉన్న మూడింటిలో ఒక పాత్రని పరిహరించటం దర్శకునికి కథ మీద ఉన్న పట్టుని సూచిస్తుంది! రెండే పాత్రలతో కథ విసుగు పుట్టించదా అంటే… చిత్రశీర్షికలోనే పేర్కొన్నట్టు “మన అమ్మానాన్నల ప్రేమకథ” మనకు విసుగు పుట్టిస్తుందా? ఆసక్తికరంగా చెప్పగల నేర్పుంటే ప్రేక్షకుల ఓర్పుకి అంచులను అంచనా వెయ్యవలసిన అవసరం లేదు. ఆ నేర్పు తనికెళ్ళ భరణిలోని రచయితకి ఉంది. దర్శకుడిగా ఆయనకి తొలి అడుగుకి సహాయకులుగా తక్కిన బృందమంతా ఉంది.
పోరాటాలు, నృత్యాలు వంటి వాటికి అవకాశమే లేని విధంగా రెండు ముసలి పాత్రలతో కథ నడుపుతూ, పాటలు కూడా పెద్ద(వి)గా లేకుండా, హాస్యమనో మఱొకటనో ప్రత్యేకంగా లేకుండా కథని చెప్పడం కత్తి మీద సాము కావచ్చు. కానీ, దర్శకుని రచనాపటిమకి దన్నుగా ఆయన మనసెఱిగిన సంగీతదర్శకుడు, గీతరచయితలు, గాయకులు, దృశ్యకదర్శకుడు (cinematographer), కళాదర్శకుడు, వస్త్రాలంకరణానిపుణులు, కూర్పరి (editor), అందఱి కన్నా మిన్నగా ఆ చిత్ర నిర్మాత అభిరుచి ఉండగా అంతటి సామునైనా రక్తి కట్టించగలిగారు భరణి. ఆయన నేర్పు కథావిస్తరణలోనూ, తెలుగుదనాన్ని కథాకథనాల్లోకి అంతర్వాహినిగా చొప్పించటంలోనూ, తెలుగు నుడికారాన్ని ప్రతి వాక్యంలోనూ నింపుకున్న సంభాషణారచనలోనూ, అన్ని నైపుణ్యవిభాగాలనూ సమర్థవంతంగా ప్రోత్సహించి నడిపించటంలోనూ ఉంది.
నటులు స్వతహాగానే నేర్పరులు, పైగా మంచి అభిరుచి ఉన్న చలనచిత్రరూపకర్తలు వాళ్ళని మఱింతగా ఉత్సాహపఱచగలిగితే బాలు-లక్ష్మి పూర్తిగా అప్పదాసు-బుచ్చిలక్ష్ములే అయిపోయారు! వాళ్ళ కథ మన అమ్మానాన్నల కథగానే అనిపించటానికి వాళ్ళ నటనే కారణం. అప్పదాసు దేవుడిని అర్థం చేసుకున్న భక్తుడు, జీవితాన్ని అర్థం చేసుకున్న వేదాంతి, భార్య విలువ పూర్తిగా తెలిసిన భర్త, సొంత బిడ్డల పై ప్రేమని బంధనంగా మార్చకుండా చెట్లను, పశువులకు సొంత బిడ్డల్లా చూడగల తండ్రి, మానవతాదృక్పథంలో చేతనయిన సాయం చేయగల మనిషి, …తిండిపోతు, చఱ్ఱున ఉడుక్కునే లేదా కోపమూ తెచ్చుకునే ఆవేశపరుడు. బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్ర తన కోసమే పుట్టిందన్నంత అలవోకగా నటించి మెప్పించారు. బుచ్చిలక్ష్మి భర్తతోనే లోకమన్నట్టు బ్రదికినా భర్తకి సుద్దులు చెప్పగల ఆధునిక మహిళ, భర్త అవసరాలను కనిపెట్టుకుంటూ ఉండి కళ్ళలో పెట్టుకుని చూసుకునే భార్య, ఇంటికి రాబోతున్న పిల్లలకు మనవలకు ఒళ్ళు హూనమయ్యేలా పిండివంటలు చేసి పెట్టే తల్లి, అవసరమయితే భర్తకు నాలుక మండిస్తుంది, దొంగబెల్లం కోసం వేలు చితక్కొట్టుకుంటే మందిస్తుంది, అవకాశముంటే తాంబూలాలను చెట్టుకే చిగురింపజేస్తుంది. లక్ష్మి సాక్షాత్తు బుచ్చిలక్ష్మిగా మాఱిపోయారు. ముఖ్యంగా చిత్రం చివర్లో లక్ష్మి నటన యెన్నదగినది. నోరు కుక్కుకుని యేడవడంలో కూడా అంతటి ప్రతిభని చూపగల అసమాన నటిని తానని సోదాహరణంగా నిరూపిస్తారు.
ఈ చిత్రాన్ని చూసి వదిలివేయలేము. కథతో బాటుగా సాగుతూ అనుభవిస్తాము, అనుభూతిస్తాము, అశ్రువులు రాలుస్తాము, ఆనందాన్ని పొందుతాము. “అనుభవించి పలవరించమని” శ్రీశ్రీ చలానికి చెప్పినది యిటువంటి ఆస్వాదన గుఱించేననిపిస్తుంది. తెలుగుచలనచిత్రాలలో సమగ్రానుభూతిని పంచగల చిత్రాలు తగ్గుతున్న నేటికాలంలో “మిథునం” తగు రసానుభూతిని కలిగిస్తుంది. మఱింత హృద్యంగా ఉండే అవకాశం లేకపోలేదని చెప్పవచ్చు కానీ… అది నేటి కాలంలో అత్యాశగా అనుకోవచ్చు.